Thursday, February 3, 2011

'టీ' కోసం మందు త్యాగం

'టీ' కోసం మందు త్యాగం

వరంగల్: మందు ముట్టం. చచ్చినా తాగం. తెలంగాణ ఇచ్చే వరకూ మందు కొట్టం. ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి ఇవ్వం..అంటూ భీషణ ప్రతిజ్ఞ చేశారా ఊరివారు. ఒకవేళ కట్టు దాటు ఒట్టు తీసి గట్టు మీద పెడితే శిక్ష ఏమిటో తెలుసా? గుండు గీసి ఊరంతా గాడిద మీద ఊరేగించడం. వరంగల్ జిల్లా రఘునాథపల్లె మండలంలోని ఓ చిన్న గ్రామం ఖిలాషాపూర్. అక్కడ మందు బాబులంతా కలిసి ఇక తెలంగాణా వచ్చే వరకూ మద్యానికి దూరంగా ఉండాలని ఇటీవలే తీర్మానించుకున్నారు.

ఈ ఊరిలోని 500 మంది వరకు పెద్దలుంటారు. వీరిలో మున్నూరు కాపులు, గౌడ కులాలకు చెందిన వారు ఎక్కువ. వీరంతా రోజూ మందు కొడుతూ కులాసాగా గడిపేస్తూ ఉంటారు. అయితే ఇకపై మాత్రం మద్యం తాగరాదని వీరంతా ధృఢ సంకల్పంతో నిర్ణయించుకున్నారు. తీసుకున్న నిర్ణయాలు ఏ క్షణంలోనైనా మారిపోవచ్చని గతంలోనే తెలిసొచ్చినట్లుంది వీరికి. అందుకే ఏకంగా ఒట్టు వేసుకోవాలనుకున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 2 తేదీన అంతా ఊరిలోని ఓ చోట చేరి సమావేశమయ్యారు.ఇకపై మద్యం తాగరాదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు మద్యం జోలికి పోరాదని తీర్మానించుకున్నారు. అంతటితో ఆగక ఇకపై మద్యం ముట్టుకునేది లేదని తమ పెళ్ళాం, పిల్లలపై ఒట్టు పెట్టుకున్నారు.

వీరిలో అకస్మాత్తుగా మద్యపానానికి స్వస్తి చెప్పేలా చైతన్యం రావడం వెనుకు ఓ వ్యక్తి ఉన్నారు. ఈ ఊరికే చెందిన కె కృష్ణం రాజు బాగా చదువుకుని హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా స్థిరపడ్డారు. ఇటీవల ఆయన తన స్వగ్రామానికి వెళ్లినపుడు పెద్దలంతా మద్యం తాగుతుండటాన్ని గమనించారు. దీంతో ఓ రోజు ఆయన వీరితో సమావేశం ఏర్పాటు చేసారు. తెలంగాణ కోసం మన ప్రాంతానికి చెందిన విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాలు చేసుకుంటుంటే, మీరు మాత్రం మద్యం తాగుతూ సీమాంధ్రలకు పన్నులు కట్టి లాభం చేకూరుస్తారా..అంటూ ఊరి పెద్దలకు క్లాస్ తీసుకున్నాడు.

No comments:

Post a Comment