Wednesday, December 29, 2010

PRIYADHARSHAN

హ్యాపీ న్యూ ఇయర్ !             -  కంచర్ల సుబ్బానాయుడు

          
           
                          రిత్ర పుటల్లోకి     మరో  సంవత్సరం  చేరిపోతుంది...   హర్షాతిరేకంతో  నవతరం నవ వసంతాన్ని ఆహ్వానిస్తుంది. .. కొత్త  సంవత్సరం  అందరి ఆసలు పండిస్తుందని, కొత్త జీవితానికి తెరలేస్తుందని ఆశించడం మానవ సహజం. ఆ శుభాకా  మనసు అభిమానులందరికీ పంచుతూ అభినందనల్ని పంపుతాం. విశ్వవ్యాప్తమైన ఈ  సంప్రదాయానికి  ఏటేటా ఎన్నెన్నో  కొత్తపుంతలు తొక్కుతుంది. ఒక్కోక్కరు ఒక్కో రకంగా న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. కొంద రు పార్టీలతో ఎంజాయి  చేసుకొంటే, మరి కొందరు రాత్రంతా  మేలుకొని... అర్ధరాత్రి దాటాక ఒకరినొకరు విష్ చేసుకుంటారు.  యింకొందరు ముందుగా మనసుకు హత్తుకొనేలా తమ సందేశాలను అందంగా  ముద్రించిన గ్రీటింగ్స్, లేటెస్టుగా  ఇంటర్నేట్ ద్వారా  ఈ -గ్రీటింగ్స్, మొబైల్  ద్వారా మెసేజెస్ పంపుతున్నారు. 

         శుభాకాంక్షలను  ఎలా  అందిస్తేనేమి?  మనజీవితంలో  చోటుచేసుకున్న ప్రతి శుభ సందర్భమూ అభినందనా ర్హమే. వాటిని గుర్తుపెట్టుకొని ఆప్తులు, అభిమానుల్ని  అభినందించినపుడు హృదయం వుప్పొంగిపోతుంది. ఉత్సాహంతో మది నిండుతుంది. అందుకే అభినందనలను అందుకోవడమేకాదు.
ఆ  అందుకోవడంలో వున్న ఆనందాన్ని అనుభవించినవారు యితరులకు ఆ  ఆనందాన్నిపంచడానికి ముందుంటారు.  డిసెంబర్ నెలాఖరు కావడమే  ఆలస్యం.... కొత్త సంవత్సరాన్ని హుషారుగా ఆహ్వానిస్తారు.... 

హ్యాపీ న్యూ ఇయర్ ! 
అంటూ ...     







     ఆ రోజు అందరి నోటా ఇదేమాట .
వెనువెంటనే వచ్చే మరో ప్రశ్న...  ఈ సంవత్సరం న్యూ ఇయర్ కి  ఏం చేయబోతున్నారు?   అని.
అవును  మరి... ఇంతకీ మీరేం చేయాలనుకుంటున్నారు?  ఈతరం అమ్మాయల అభిప్రాయాలు యిలా  వున్నాయి.
వారి మాటల్లో... 

చిరకాలం గుర్తుండిపోతాను
   
 

    చిత్ర కళ    నా హాబి.  అందుకే న్యూ ఇయర్ కు గ్రీటింగ్ ను  నేనే స్వయంగా   రూపొందించు కొంటాను.   చిన్న పెద్ద  కార్డుల  మీద   ఎంతో   చక్కని చిత్రాల్ని గీసి అంతటితో  ఊరుకోకుండా  ఆ చిత్రాలకు తాగినట్లు గా చమ్కీలు, పూసలు, అద్దుతూ   అలంకరణ చేసి మరీ   దాచుకునేలా పంపుతాను.   దాంతో నా అభినందనలను  అందుకున్నవారికి నా బొమ్మతో పాటు నేనూ చిరకాలం గుర్తుండి పోతాను. 


- ఉమ
న్యూ ఇయర్ కేక్ కట్ చేస్తాం

  వేకువజామునే నిద్ర లేచి కొత్త దుస్తులతో రడీ అవుతా. అలాగే ఇంటిల్లపాది.
మా అపార్టుమెంటులో న్యూ ఇయర్ కేక్ కట్ చేస్తాం
తర్వాత కబుర్లుతో ఎంజాయి చేస్తాం.  ఫ్రెండ్స్ అందరం విషెస్ చెప్పుకొని, 
ముందుగా అనుకున్న  ప్రకారం హాయిగా షికార్లు కొడతాం
 -  సులక్షణ


 ఎంజాయి  చేస్తాం.
 కొత్త సంవత్సరాన  కుటుంబ సభ్యులతో గడుపుతాను.  అర్ధరాత్రి  గడిచాక విషెస్ చెప్పుకొంటాం. ఫస్ట్ తారీఖున  ఫ్రెండ్స్ తో    ఎక్కడి కైనా వెళ్లి ఎంజాయి చేస్తాం.   
  - శాంతి

సందర్భం స్పురించాలి 

    సాధారణంగా  హస్త కళల పట్ల ఆసక్తి కలిగిన నేను చాలా రకాల బొమ్మలను తయారు చేసేదాన్ని. 
కార్డులనే మరచి పోతున్న ఈ తరుణంలో అవి జ్ఞాపకాలుగా మిగలకూడదని పాత  పద్ధతిలోనే  గ్రీటింగ్ కార్డ్స్ తోనే   సుభాకాంక్షలను అందిస్తున్నాను. పైగా వాటిని నేనే స్వయంగా తయారు చేస్తాను. సెల్లు, కంప్యూటర్ స్పీడ్ పెరిగిన 
గత  మూడేళ్ళ నుంచి వీటిపై మరీ ఉత్సాహం పెరిగింది. 
- మాలేపాటి  మాధురి
ఇంట్లోనే న్యూ ఇయర్
  
న్యూ ఇయర్ కు నైట్  పార్టీలకు వద్దంటున్నారు.  అందుకే ఇంట్లోనే  సెలబ్రేట్  కుంటాం. ఫ్యామిలీ మెంబర్స్ తో  ఏదైనా గుడికి వెళ్ళుతాం.  ఫ్రెండ్స్ తో గాని,  కుటుంబ సభ్యు లతో గాని  సాయంత్రంగా పార్కుకు వెళ్తాం. అలాగే ఫ్రెండ్స్ కు గ్రీటింగ్ కార్డులు పంపుతాను. తాజాగా నేను   త్రీడైమెన్షనల్ గా   కన్పించే కార్డులు రూపొందించడం లో నిమఘ్నమైనాను. పేపర్ క్రాప్ట్ తో, శాటిన్ పువ్వు లతో, ఆకులతో రూపొందించిన గ్రీటింగ్ కార్డులవి.  ఏదో ఒక చక్కటి దృశ్యం అని కాకుండా సందర్భాన్ని ప్రతిబింబించేలా
చక్కటి దృశ్యాన్ని ఉహించుకొని దానికి రుపమిస్తే గ్రీటింగ్ అందం ఇనుమడిస్తుందని, ఆశయం నెరవేరుతుందని ఆశ.
-  కోలా భవ్య

రోజంతా కంపుటర్ ముందే

      న్యూ ఇయర్ వచ్చిదంటే చాలు.  ఆ రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని ఫ్రెండ్స్ అందరికి గ్రీటింగ్స్ చెప్తాను. పేస్ బుక్, ఆర్కుట్ లలో చాటింగ్ చేస్తాను. ఫ్రెండ్స్ కు ముందుగానే మెసేజెస్ యిచ్చుకొని నెట్లో కలుసుకుంటాం. ఏడాదికి ఒకసారి వరల్డ్ లో వున్న  ఫ్రెండ్స్ అందరితో ముచ్చటించుకుంటాం. న్యూ ఇయర్ మరఛి పోలేని రోజు.  ఏ ఏడాదికి ఆ ఏడు కొత్తదనమే. ఆ రోజు  కొత్త వారు పరిచయమవుతారు. ఎన్నో.. ఎన్నెన్నో.. అనుభూతులు.  సాయంత్రం  సరదాగా   లోకల్ ఫ్రెండ్స్ తో   ఆరుబయటికి  వెళ్లి గ్రాండ్ గా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుంటాం.
-  జయ లక్ష్మి 

మంచి - చెడు గుర్తించుకుంటా!

    న్యూ ఇయర్  అంటే ఆనందమూ వుంది, గతానుభావాలతో భయం వుంది. విజయాలకు గట్టి జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించు కొనేది న్యూ ఇయర్ లోనే. ఈ ఏడాది లో మేం చేసిన మంచి చెడులను ఓ సారి గుర్తు చేసుకుంటాం. కొత్త ఏడాది  ఉదయాన్నే లేచి గుడికి వెళ్తాం. ఆ తర్వాత మొబైల్ అందుకొంటాం. ఫోన్స్, మెసేజెస్ చేసుకుంటాం. ఓ గంట ఇంటర్నెట్ లోకూర్చుంటా.  కలుసుకోవాల్సిన పెద్దల్ని, ఫ్రెండ్స్ ను న్యూ ఇయర్ లో హైలెట్.
-  ప్రతిభ


సందేశాల జోరు 

     న్యూ  ఇయర్ లో గ్రీటింగ్స్ స్వయంగా తయారు  చేసిపంపడం నాకిష్టం. రకరకాల పువ్వులు, మిక్కిమౌస్, వాటర్ కలర్స్, పెయింటింగ్స్ తో,  అనేక పద్దతులతో వైవిద్యం తో గ్రీటింగ్స్ పంపడం ఒకప్పటి  అలవాటు. రోజులు మారాయి. యిప్పుడు ఫోన్ లో ముక్తసరిగా మాట్లాడుకోవడం... సెల్ ఫోన్స్ వచ్చాక మారింది. కానీ,  ఎస్  ఎం ఎస్ ల రాకలతో సందేశాలలో ... ఈతరం  ధోరణి లో స్పీడ్ పెరిగింది.
      ఆ రోజు  బాయ్ ఫ్రెండ్స్ తో  మాట్లాడు కోవడం కష్టం. అందుకే న్యూ ఇయర్ కి   ఎస్  ఎం ఎస్  ద్వారా మెసేజెస్ పంపుతాం. రిప్లై కూడా పొందుతాం.  లేదంటే  నెట్ కి వెళ్తాం.    way2sms   లాంటి  సైట్ లో మెసేజెస్ పంపుకుంటాం,  యాహూ, గూగుల్, పేస్ బుక్ , తెలుగు పీపుల్   మొదలగు వెబ్ సైట్ లో చాటింగ్ చేస్తాం. న్యూ ఇయర్ ఎంజాయ్ అంతా..  యింతా కాదు. అందుకే  న్యూ ఇయర్  కు స్వాగతం పలుకుతాం.

-   దొడ్ల  స్వాతి.

Monday, December 27, 2010

మహిళల చిత్రలిపి

ముగ్గులతో మహద్భాగ్యం

 

హేమంతం ఆహ్లాదం..
ధనుర్మాసం ఆరంభం..
తెలుగు వాకిళ్ల అందమే అందం...
తూర్పు తెలతెల వారకుండానే..
వయసు వ్యత్యాసం లేకుండానే..
ఇంతులంతా,
ఎంతో శ్రమతో, అత్యుత్సాహంతో..
ముగ్గుల రూపంలో పేర్చిన ముత్యాలు, రత్నాలు
ఉదయ కిరణాలకు స్వాగతం పలుకుతాయి.


ఒక్క తెలుగునాటేనా?.. అంటే.. కాదనే చెప్పాలి. హైందవ సంస్కృతికి సంకేతాలుగా ముగ్గులను చెప్పుకోవచ్చు. ఈ ముగ్గులు భరతభూమిలో అన్ని ప్రాంతాల్లోనూ కనువిందు చేస్తుంటాయి. వీటిని రంగులతో నింపి కళాత్మకంగా తీర్చిదిద్దుతారు కాబట్టి ఈ ముగ్గులను మనం అచ్చ తెలుగులో.. రంగవల్లిక లంటాం.

తెలుగునాట ‘రంగవల్లిక’లన్నా..
తమిళులు ‘కోలం’ అన్నా..
బెంగాలీలు ‘అల్వన’లన్నా..
మహారాష్ట్రీయులు రంగోలీ అన్నా..
రాజస్థానీయులు ‘మండనా’లన్నా..
ఎక్కడ ఏదేమన్నా..
ఎవరేమన్నా..
మన దేశంలో ముగ్గు..
ఓ ఆచారం.. అందం..
అంతకుమించి మంచి ఆరోగ్యం..

కాలం కన్నా వేగంగా పరుగులెట్టే నేటి కంప్యూటర్ యుగంలో కూడా అతివలు ముగ్గువేసే.. సంప్రదాయాన్ని మాత్రం మరువలేదు. సరికదా! ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహించేలా.. నేడు వివిధ ప్రాంతాల్లో జరిగే ముగ్గుల పోటీల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

అయితే..
అతివలు వారివారి ప్రతిభా పాటవాలతో అలవాటు ప్రకారం ముగ్గులు వేస్తుంటారు. అక్కడితో ఆ విషయాన్ని వదిలేస్తారు. అందులోని అర్థాన్నీ, పరమార్థాన్నీ పెద్దగా పట్టించుకోరు. లోతుగా ఆలోచించరు. ఈ ముగ్గులనేవి మహిళల సృజన శక్తికి సంకేతం. అరవై నాలుగు కళల్లోనూ ఇదీ ఒక కళ. చిత్రలేఖనంలో ఓ భాగం. స్ర్తిల మనోభావాల్ని ప్రతిఫలింపజేసే ప్రతి ముగ్గు ఓ చిత్రం. అంతకు మించి అద్భుతమైన ‘చిత్రలిపి’గా ముగ్గును చెప్పవచ్చు.
సింధు నాగరికతలోనూ, రుగ్వేదంలోనూ కనిపించే స్వస్తిక్, చతురస్రం గుర్తులు నేటి ముగ్గుల్లోనూ కనిపిస్తున్నాయి. కాబట్టి చిత్రలిపే రంగోలీలకు మూలంగా పేర్కొనవచ్చు. ఇంతటి ప్రాచుర్యం పొందిన ముగ్గులోని వైశిష్ట్యాన్నీ, విజ్ఞానాన్నీ, దాని కథాకమామీషును తెలుసుకుందాం.
మన దేశం అంతటా ఉపయోగించే ముగ్గు పిండి తెలుపు. స్వచ్ఛతకూ, శాంతికీ సంకేతం. దీని తయారీకి ఉపయోగించే బియ్యం పురోభివృద్ధికి సంకేతం. కొన్ని ముగ్గుల్లో నింపే పసుపు రంగు శుభానికీ, కుంకుమ పవిత్రతకూ చిహ్నంగా చెబుతారు. పల్లెల్లోనే కాదు, పట్టణం, నగరాల్లో కూడా వాకిళ్లలో ముగ్గు వేయని వారు అరుదే. ఇంటి ముంగిట ముగ్గు వేశాక మగవారు గడప దాటి వెళ్లడం ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కుటుంబాల్లో సంప్రదాయంగా వస్తోంది. ముగ్గులేని వాకిలి అశుభాన్ని సూచిస్తుంది. అందుకే వాకిట ముందు ముగ్గు వేయడం మహిళలు మానరు. ఉదయ వేళల్లో పొడవుగా పెద్దపెద్ద ముగ్గులు వేస్తే, సాయంత్రం వేళల్లో అడ్డంగా చిన్న ముగ్గులు వేస్తారు.
ఉదయపు వేళయితే పొడవాటి ముగ్గుల్ని స్వాగతంగా భావించి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందనీ, సాయంత్రం ఆమె ఇంటిని విడిచి వెళ్లకూడదని అడ్డంగా చిన్న ముగ్గులు వేస్తూంటారు. ఇంటి లక్ష్మిని వాకిలి సూచిస్తుంది. ముగ్గు ఒలికినా అందమే లాంటి నుడికారాలు అందుకే వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో సంప్రదాయపరమైన ముగ్గులకన్నా రంగుల ముగ్గులకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు. వాటి రూపం మారిందే గాని ఉనికికి మాత్రం ప్రమాదం ఏర్పడలేదు. ముఖ్యంగా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తోన్న నేటి మహిళా మణులు తమ యాంత్రిక జీవితంలో ముగ్గు ప్రాధాన్యాన్ని ఏ మాత్రం విస్మరించకపోవడం హర్షణీయం.
అంతేకాదు. చిత్రకారులకూ, కార్టూనిస్టులకూ వస్తువులుగా ఉపయోగపడుతూ వస్త్ర ప్రపంచంలోని ఆధునిక డిజైన్లలో కూడా చోటు చేసుకున్న మన ముగ్గులు అంతర్జాతీయంగానూ ప్రాముఖ్యం చెందాయి. అందుకే మన రంగోలి రేఖ, సంప్రదాయ, ఆరోగ్య రేఖ మాత్రమే కాదు సౌందర్య రేఖ కూడా. ఈ కంప్యూటర్ యుగంలో అమ్మాయిలు సైతం చేతిలో ముగ్గు పిండి పట్టుకుని ఉదయానే్న రంగవల్లికలు అద్దుతున్నారంటే నిజంగా శుభ సంకేతం.. శుభ పరిణామం.
చాలామంది పెద్దవాళ్లు - ‘ముగ్గు గీత గీచిరా; ముగ్గు కర్ర వేసిరా’ అని పిల్లలకు చెబుతుంటారు. అలా చేయడంవల్ల దుష్ట శక్తులు లోపలకు రాకుండా ముగ్గులు అడ్డుకుంటాయని విశ్వాసం. చాలావరకూ ముగ్గును రోజూ సున్నపు పొడితోనే వేస్తారు. రాతి యుగంలో కూడా రాక్షసి గుళ్లుగా పిలిచే సమాధుల చుట్టూ కూడా సున్నపు గీతలు గీసిన నిదర్శనాలు కనిపిస్తాయి.

ముగ్గలోని చుక్కలూ, గీతలూ భగవంతునికి సంకేతాలుగా చెబుతారు. సమబాహు త్రిభుజాకారం ముగ్గు విష్ణుమూర్తికి, తిరగబడిన త్రిభుజం శివునికీ, పరస్పరం ఖండించుకుపోయే రేఖలు బ్రహ్మదేవునికి సంకేతాలుగా నిలుస్తాయి.
‘చుక్కల ముగ్గు’ ద్రవిడ సంప్రదాయం కాగా, రేఖల ముగ్గు ఆర్య సంప్రదాయం. గీతలు (రేఖలు), చుక్కలూ రెండింటిని పుణికి పుచ్చుకుని ముగ్గులు వేయడం మన సంప్రదాయం. చుక్కలతో వేసే ముగ్గుల్లోనూ రకాలున్నాయి. చుక్కల చుట్టూ ముత్యాల్లా వచ్చేవాటిని ముత్యాల ముగ్గులనీ, చుక్కలు కనిపించకుండా రేఖా గణితంలోని కోణాల మాదిరి కనిపించే వాటిని రత్నాల ముగ్గులని అంటుంటారు.
ముగ్గుల్లోని వృత్తాలు, చదరాలు, దీర్ఘ చతురస్రాలు, చతుర్భుజాలు, షడ్భుజాలు, త్రికోణాలు.. రేఖా గణితాంశాల్ని సూచిస్తుంటాయి. ఆలాగే గణితానికి ఆధారాలైన ప్లస్, మైనస్, ఇంటూ గుర్తులు.. కొన్ని ముగ్గుల రూపకల్పనకు మూలాధారాలు. స్వస్తిక్ కూడా ఇంటూ గుర్తుతోనే ఏర్పడుతుంది.

ముగ్గులు - అక్షరాలు..

ముత్యాల వంటి తెలుగు అక్షరాలను ఆధారంగా చేసుకుని ముగ్గులు రూపొందించడం కూడా మహిళలకే చెల్లింది. తలకట్టులేని ఎన్నో అక్షరాలు అంచుల ముగ్గుల్లో కనిపిస్తాయి.
రసాయన శాస్త్రంలోనూ ముగ్గులు..
ఇంతులకు నిజంగా రసాయనిక పరిజ్ఞానంతోనే ముగ్గులను రూపొందిస్తున్నారని చెప్పవచ్చు. ఆ శాస్త్రంలోని బెంజిన్, క్లోరోఫిల్, హీమోగ్లోబిన్ నిర్మాణాలు ముగ్గుల్లో కనిపించటం విశేషం. అలాగే తెలుగింట వేసే అతి సామాన్యమైన సరళమైన గీటు ముగ్గులో అణు నిర్మాణం గోచరించడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ నాటి మన చరక, శుశ్రుత, నాగార్జున, ఆర్య, దేవ తదితర పండితులు వివిధ శాస్త్రాంశాల్లో ప్రావీణ్యం సంపాదించారని చెబుతారు. ఆ ప్రభావం మహిళలు వేసే ముగ్గులపైనా పడి ఉంటుంది.
నేటికీ సంక్రాంతి సమయాల్లో వేసే నెల ముగ్గులతోసహా అనేక ముగ్గులు గృహ, దేవాలయ, నగర నిర్మాణాల నమూనాలను పోలి ఉండటం నిశితంగా గమనించవచ్చు. ఇందుకు ప్రసిద్ధి చెందిన ఖజురహో దేవాలయ నిర్మాణాలను పోలిన ముగ్గులు వాస్తు విజ్ఞానాన్ని చెప్పకనే చెబుతున్నాయి.


ఆరోగ్య ప్రదాయిని..

ఔషధ గుణాలు కలిగి ఉన్న తులసి చెట్టు గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టే దాని ముందు చూడముచ్చటగా ముగ్గులు వేసి, ప్రదర్శనలు చేసే ఆచారం వచ్చింది.
పల్లెల్లో నేటికీ ధాన్యపు గాదెలు, భోజనాలు చేసే ప్రదేశాల్లోనూ, చల్ల చిలికే చోట, విసుర్రాయి దగ్గర, పొయ్యి గోడల చుట్టూ ముగ్గు గీతలను గీస్తుంటారు. ఇందుకు ముగ్గు పిండినే కాదు ఎర్రమట్టిని, చివరికి పేడనూ ఉపయోగిస్తారు. దీనివల్ల సూక్ష్మ జీవులు నశించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయనేదే ఇందులోని అర్థం.. పరమార్థం. యోగవిద్యతోపాటు వైద్య శాస్త్రం కూడా పల్లె పడుచులు చిత్రించే ముగ్గుల్లో స్పష్టంగా కనిపిస్తుంటుంది. ప్రభాత సమయంలో వాకిట్లో కళ్లాపి చల్లి వేసే ముగ్గుల్లో ఆయుర్వేదాంశాలు కనిపిస్తాయి. గోమయం క్రిమి హారి. ఇది మశూచి లాంటి వ్యాధుల్నీ, దోమల్నీ నివారిస్తే, కళ్లాపి మీద వేసే తెల్లటి ముగ్గు పొడి సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తుంది. ముఖ్యంగా వేకువ వేళనే వాకిలిలో వంగి ముగ్గులు వేయడం అనేది స్ర్తిలకు మంచి వ్యాయామమే కాదు, వారిలో ఏకాగ్రతనూ, ప్రశాంతతనూ పెంపొందిస్తుంది.
రోజూ సున్నపు రాయితో చేసే ముగ్గు పొడినే వాడినా, పండుగ సమయాల్లో మాత్రం బియ్యం పిండితో వేస్తారు. అలా వేయడం వల్ల ఆ పిండి పక్షులకూ, చీమలకూ ఆహారంగా ఉపయోగపడటంతోపాటు పుణ్యమూ వస్తుందనే భావం చాలా కాలం నుంచీ పాదుకొంది. అలాగే ఆడపిల్లలు ఆడే పచ్చీసు, తాడు ఆట, తొక్కుడు బిళ్ల.. లాంటి ఆటల్ని సూచించే ముగ్గులూ ఉన్నాయి. అందుకే ‘ముగ్గులు’ అనేవి స్ర్తిల మనస్తత్వానే్న కాదు, వారి సృజనాత్మకతకు, విజ్ఞానానికి, సామాజిక వ్యవస్థకు అద్దం పడతాయి.

-కంచర్ల

టీనేజ్

బాయ్‌ఫ్రెండ్ అవసరమా?

టీనేజ్ అమ్మాయిల

మనోగతం మీరేమంటారు?

- కంచర్ల

బాయ్ ఫ్రెండ్ అవసరమా? అంటే.. ఎందుకు లేదు

అంటున్నారు ఈ తరం అమ్మాయిలు.

కొన్ని కుటుంబాల్లో బాయ్ ఫ్రెండ్ స్నేహాన్ని ప్రోత్సహిస్తున్నారు.

అయితే అన్ని కుటుంబాల వాతావరణం ఒక్కలా ఉండదు. అబ్బాయిలతో స్నేహాల మీద ఆంక్షలు విధించే పెద్దలు నేటికీ ఉన్నారు.

సినిమాలు, టివిలు చూసి పిల్లలు పెడత్రోవ పడుతున్నారని, కొంతమంది తల్లిదండుల అభిప్రాయం. సమాజంలో జరిగే సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తున్నామని సినీ పరిశ్రమ వారు చెప్తున్నా అందుకు పెద్దలు ఏకీభవించడం లేదు. ఇప్పటి పరిస్థితుల బట్టి ఏదో ఒకమూల జరిగిన సంఘటన తీసుకుని కథలు అల్లి సినిమా తీయడంవల్ల అనవసర ప్రచారం ఇవ్వటం జరుగుతుందని, కాలేజీలంటే చదువుకు తప్పించి మిగిలిన పనులన్నింటికీ నిలయంగా చూపిస్తున్నారని పెద్దల ఆరోపణలు.

ఆడపిల్లల్ని ఏడిపించడం, లెక్చరర్స్‌ను ఆట పట్టించడం, ప్రేమ పేరుతో ఉన్మాదిగా వ్యవహరించటం లాంటి సంఘటనలు అధికంగా ఉంటున్నాయని, దీంతో అదే తరహాలో పిల్లల నిజ జీవితంలో వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు అంటున్నారు.

నేటి అమ్మాయిలు కాలేజీలో చేరిన మరుక్షణమే బాయ్ ఫ్రెండ్‌ని ఎంపిక చేసుకుంటున్నారని కొంతమంది పెద్దల అభిప్రాయం.

ఒకవేళ బాయ్‌ఫ్రెండ్‌ను సెలక్ట్ చేసుకోకపోయినా సాటి అమ్మాయిల హేళనకు గురి అవుతున్నారని అమ్మాయిలే అంటున్నారు.

తల్లిదండ్రుల ఆంక్షలకు లొంగి ఉండి, తోటివారి జోక్‌లు భరించాలో లేక పెద్దలను ఎదిరించి బాయ్ ఫ్రెండ్‌తో తిరిగాలో తెలియక చాలామంది
అమ్మాయిలు మదనపడుతున్నారు.

ఒకసారి బాయ్ ఫ్రెండ్‌ని ఎంపిక చేసుకున్న తరువాత తరచుగా కలుసుకోవాలని మనసు ఉవ్విళ్లూరుతుంటుందని, కాని ఇంటి వాతావరణం అనుకూలించదని అమ్మాయిలంటున్నారు. ఫలితంగా పక్కదారులు వెదుక్కోవాల్సి వస్తుందని, ఇంటి దగ్గర అబద్ధాలు చెప్పి బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయట. బయట తిరిగేటప్పుడు ఇతరుల కంట పడకుండా వుండాలనే ప్రయత్నంలో రహస్య ప్రదేశాలను వెతుక్కోవాల్సి వస్తుందని కొంతమంది అమ్మాయిలు చెప్తుంటే, ఇలా చేయడంవల్ల బాయ్ ఫ్రెండ్ ఎక్కువ చొరవ తీసుకుని ఆకర్షణలకు గురిచేసే ప్రమాదాలు ఏర్పడుతున్నాయని మరికొందరు అంటున్నారు.

ఇలాంటి పిల్లల ప్రవర్తనల వల్ల సమాజంలో పిల్లలతో పాటు తాము చెడు ముద్ర భరాయించాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పిల్లల చదువును మాత్రమేకాక వ్యక్తిత్వాన్ని, కుటుంబ పరువు ప్రతిష్టలను దారుణంగా దెబ్బతీస్తున్నాయని పెద్దల ఆందోళన. టీనేజ్ వయసులో ఆడ, మగ అసలు కలవకూడదని, ఒకరితో మరొకరు మాట్లాడకూడదని కాదు. అటువంటి ఖచ్చితమైన నిబంధన ఈ రోజుల్లో ఏ తల్లిదండ్రులు విధించడం లేదు. అది కుదిరేది కాదు కూడా. అమ్మాయిలు కూడా ఎంతో దూరం ప్రయాణం చేసి గాని తమ కాలేజీలకు చేరటం లేదు. కాబట్టి యువతీయువకులకు వారు కలిసే అవకాశం అధికం. ఇలాంటి సామాజిక వాతావరణంలో ఎవరిమీద వారికి నియంత్రణ ఉండాలేగాని మరెవరి కోసమో అన్నట్టు ప్రవర్తించకూడదు.


టీనేజ్‌లో ప్రేమ పేరుతో బాయ్ ఫ్రెండ్ చేయటం వల్ల వచ్చే నష్టాలను తెలుసుకోవాలని ఎలాంటి ఆకర్షణలకు లోను కాకూడదని అటు తల్లిదండ్రులు, ఇటు బోధకులు అభిప్రాయ పడుతున్నారు. టీనేజ్‌లో చదువుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలే గాని, బాయ్ ఫ్రెండ్‌ను సెలక్ట్ చేసుకోవడం, ఆ పేరుతో ప్రేమలో పడటం, జీవితమంటే ఏమిటో సరైన అవగాహన లేక ఆటుపోటులను ఎదుర్కోవడం మంచిది కాదని పెద్దల అభిప్రాయం.

టీనేజి వయసులో ప్రేమ, పెళ్ళికి తొందర అనవసరం. ఏ వయసుకు ఆ ముచ్చట అన్న మన పెద్దల మాట అక్షరాల నిజం. టీనేజ్ అనేది చదువుకు సంబంధించింది. ఆ వయసులో నేర్చుకున్న ‘విద్య’ చివరిదాకా మిగులుతుంది. బంగారు భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. కాబట్టి చెడు స్నేహం, ప్రేమ వంటి అర్థం లేని ఆలోచనలు టీనేజ్‌లో చేయడం మంచిది కాదు.

-కంచర్ల


స్నేహం  మధురమైనది


జీవితంలో ఫ్రెండ్‌షిప్ అంటే తీయనైనది, మధురమైనది మరొకటి లేదు. స్నేహమనేది పెడధోరణులకు దారి తీయకూడదు. అమ్మాయిలకు, అబ్బాయిలూ, అబ్బాయిలకు అమ్మాయిలూ స్నేహితులుగా ఉండవచ్చు. క్లాస్‌మేట్స్ అందరూ స్నేహితులు కాలేరు. పరిచయాలు కాస్త పెంచుకొని ఎక్కువ సమయాల్లో గడుపుతుంటే అదే స్నేహంగా మారుతుంది. స్నేహం ఎప్పుడూ పవిత్రంగానే ఉండాలి. హద్దులు దాటితే స్నేహం అనిపించుకోదు.

-అనూష



భయమేస్తుంది!



క్లాస్‌మేట్స్ కావచ్చు. జూనియర్స్ కావచ్చు. రోడ్ రోమియోలు కావచ్చు. అందచందాలను లేదా ఆర్థిక స్థితిని చూసి ఆకర్షితులై అమ్మాయితో పరిచయం లేకపోయినా దారి కాచడం, ప్రేమ పేరుతో వేధించడం ఈ తరం అబ్బాయిలు చేస్తున్నపనే. అమ్మాయికి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా వెంటపడి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, హైదరాబాద్‌లలో విద్యార్థినులపై జరిగిన సంఘటనలెన్నో! ఆ కారణంగా బయ్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయాలంటేనే భయమేస్తోంది.

-ప్రశాంతి



అవసరం లేదు





ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో ఒకరిని బాయ్ ఫ్రెండ్‌ని ఎంచుకోవటం, పరిచయం కాస్త ప్రేమగా మార్చుకోవడం, తల్లిదండ్రుల కళ్లు కప్పి తిరగటం, చదువుమీద ధ్యాస మరచి, ఇతర వ్యామోహాలతో భవిష్యత్తును నాశనం చేసుకోవడం స్టూడెంట్ లైఫ్‌లో అంత అవసరమా? పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లిళ్లు, చేసుకుని, అవగాహన లేని టీనేజ్‌లోనే తల్లయి, భార్యాభర్తల మధ్య ప్రేమ కరువై నిత్యం పోట్లాడుకుంటూ జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకునే బాయ్ ఫ్రెండ్స్‌తో స్నేహం అవసరం ఏమాత్రం లేదు.

-రాజేశ్వరి



నమ్మకమే స్నేహం


బాయ్ ఫ్రెండ్‌తో కష్టాలు ఎదురవుతాయని, నష్టాలు వస్తాయని అంటారు. నిజమే. అలాంటివి ఎప్పుడు వస్తాయంటే స్నేహంలో ఒకరిమీద ఒకరికి నమ్మకం లేనప్పుడే. ఇప్పటి సమాజ వాతావరణానికి తగ్గట్టు టీనేజీలో బాయ్ ఫ్రెండ్స్ అవసరమే. కొందరి నుండి ఇబ్బందులను ఎదుర్కోవడానికి బాయ్ ఫ్రెండ్స్ ఎంతో దోహదపడతారు.

-శే్వత



పెళ్లిచేసుకుంన్నా



ఫ్రెండ్‌షిప్ చేయడం, ప్రేమలో పడటం, పెళ్లిళ్లు చేసుకోవడం మాతరం అమ్మాయిలకు సర్వసాధారణమే. అయితే ప్రేమ పెళ్లిళ్లలో సర్దుబాటు ధోరణి అవసరం. అది లేకపోతే కోరి కష్టాలు తెచ్చుకోవటమే. ఒకరి కోసం మరొకరు అన్నట్టుగా బ్రతకాలనుకుంటున్నాం. మా పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారు. పెళ్లి చేసుకుంన్నా.

-మనోజ్ఞ



ఫ్రెండ్‌షిప్‌కు


విలువనిచ్చే పేరెంట్స్


చదువు కోవడానికి కాలేజీలో చేరితే తోటి అమ్మాయిలూ నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరా? అంటూ అడుగుతున్నారు. బాయ్ ఫ్రెండ్స్ ఎంపిక చేసుకోలేని అమ్మాయిలను ఎందుకూ పనికిరాని వారుగా చూస్తున్నారు. మా పేరెంట్స్, ఫ్రెండ్ షిప్‌కు విలువనిస్తారు. చదువులు పాడుచేసుకోవద్దని, చెడు స్నేహం వద్దని సలహా చెప్తారు.

-జాహ్నవి



తప్పేమిటి?



బాయ్ ఫ్రెండ్స్‌తో ఇబ్బందులుంటాయి. అలాగని మనసును చంపుకుని యిష్టపడిన వారిని ప్రేమించకుండా ఉంటామా? ప్రేమలో కష్టాలుండవచ్చు. ప్రేమవల్ల గతంలో ఎందరో నష్టపోయి ఉండవచ్చు. కానీ మేం అలాంటి వారము కాదు. గతంలో విఫలమైన ప్రేమలన్నీ వ్యక్తిగత లోపాలవల్ల జరిగాయని మా నమ్మకం. బాయ్ ఫ్రెండ్‌ను ప్రేమించడంలో తప్పులేదు.

-మంజు భార్గవి



భ్రమలో పడొద్దు:



బాయ్ ఫ్రెండ్‌షిప్ పేరుతో స్నేహం చేసి ప్రేమగా మలుచుకొని అదే జీవితమనే భ్రమలో పడకూడదు. స్నేహం అన్నది ఇచ్చిపుచ్చుకోవటం కాదు. స్వార్థం విడనాడి ఆత్మీయత, అభిమానులను పొందాలే తప్ప ఆకర్షణలకు గురికాకూడదు.

- రాధ



బాయ్ ఫ్రెండ్స్   ఎందరుంటే ఏమిటి?



బాయ్ ఫ్రెండ్ ఒకరే ఉండాలన్న రూలేమీ లేదు.

బాయ్ ఫ్రెండ్స్‌ను ప్రేమికులుగా జమకడితే అది ఫ్రెండ్ షిప్ అనిపించుకోదు. బాయ్ ఫ్రెండ్ ఒకరే ఉండాలన్న కోరిక, కోరికలను కోరుకోవడమే.

-విజయలక్ష్మి



బాయ్ ఫ్రెండ్‌షిప్ మంచిది కాదు

బాయ్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడటం, విచ్చలవిడిగా తిరగటం మంచిది కాదు. నిజానికి టీనేజ్‌లో ఏర్పడేది స్వచ్ఛమైన ప్రేమ కాదు. వారు ప్రేమించేది బాయ్ ఫ్రెండ్‌ని కాదు. ప్రేమించటం అనే థ్రిల్‌ని వారు ప్రేమిస్తారు. ప్రేమంటే కలిసి బాయ్ ఫ్రెండ్‌తో కలిసి తరిగటం. బహుమతులు ఇచ్చి పుచ్చుకోవటం అనుకుంటారు. అంతకుమించి అమ్మాయిల ఆలోచనలు ముందుకు సాగవు. టీనేజ్ ప్రేమలు దీర్ఘకాలం నిలిచేవి కావు. ఆ వయసులో చూసే సినిమాలు, సీరియల్స్, ప్రేమ, థ్రిల్‌ను కోరుకునేలా చేస్తాయి. కొన్ని పత్రికల్లో వచ్చే కథలు, నవలలు కూడా అందుకు దోహదం చేస్తున్నాయి. వాస్తవానికి, ఊహకు తెలియని ఆ వయసులో అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ షిప్ అంత మంచిది కాదు.

-ప్రశాంతి,

అధ్యాపకురాలు



టీనేజ్‌లో ఫ్రెండ్‌షిప్ సమస్యలెన్నో

టీనేజ్‌లో ప్రేమకు ఆధారం ఆకర్షణ మాత్రమే. ఈ విషయంలో స్టూడెంట్స్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేయవచ్చు. కాని అది వారి అపరిపక్వ మనస్తత్వం నుండి వచ్చే మాట మాత్రమే. తమ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ అందంగా వుండాలనే కోరుకుంటారు. కొంతమంది అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ దొరక్క, మగపిల్లలను ఆకర్షించలేక నిరాశకు గురుతున్నారు. దీంతో చదువుమీద కూడా శ్రద్ధ తగ్గిస్తున్నారు. మరే అమ్మాయినీ దగ్గరికి రానివ్వని అబ్బాయి, అందం, ఆరక్షణ స్థాయి, సామాజిక స్థాయి, తెలివితేటలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోలేక, అబ్బాయిలకు లొంగి తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు అమ్మాయిలు.

-శ్రీమతి పరమేశ్వరి,

అధ్యాపకురాలు



మనసుకోరే

సుమవర్ణం..



ఎన్నో రంగులు ఇమిడిన అద్భుతం...



హైడ్రాంజియా

పొద్దు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది.

- అది పొద్దుతిరుగుడు.


పొద్దుతో పాటే రంగులూ మారిపోతే...

- అది పత్తి మందార

ఇంతవరకూ మనకు తెలిసిందే.

కానీ కొన్ని పూలు ఉన్నాయి.

మీకు కావలసిన రంగుల్లో పూయించుకోవచ్చు. కొంత కాలం గులబీ రంగులో పూస్తే మరికొంత కాలం నీలి రంగులో... ఆపైన వంకాయ రంగు... ఇలా సప్తవర్ణాలు విరబూస్తాయి.ఇదేం మ్యాజిక్ కాదు. ‘‘హైడ్రాంజియా’’ అనే మొక్క విరజిమ్మే రంగుల పూల కథ ఇది.

సృష్టికే అంచదాన్నిచ్చే పూబాలలు పలురకాలు. ఒక్కో పువ్వుదీ ఒక్కో అందం. ఒక్కో వర్ణం. ఒక్కో రూపం. కానీ

ఒక్క పువ్వులోనే ఎన్నో రంగులు ఇమిడిన అద్భుతం... హైడ్రాంజియా.



నేలతీరుమారితే ఈ పూలరంగులు మారిపోతాయి. ఇవి ఎక్కువగా గులాబీ, తెలుపు, నీలి రంగుల్లో పూస్తుంటాయి. అయితే రంగు మాత్రం నేలలోని ఆమ్లక్షార గాఢతను బట్టి మారుతుంటుంది. అంటే ఆమ్లగుణం ఎక్కువగా ఉన్న నేలల్లో పెరిగేవి నీలిరంగు పుష్పం. క్షారగుణం కలిగిన నేలల్లో పెరిగేవి గులాబీ రంగు పుష్పాలన్నీ పూస్తాయి. రెండు గుణాలూ కలిగిన నేలల్లో వంకాయరంగులో పూస్తాయి. తెలుపు రంగు హైడ్రాంజియా మాత్రం ఏ నేలలో అయినా ధవళ కాంతుల్నే వెదజల్లుతుంది.

హైడ్రాంజియాల స్వస్థలం తూర్పు ఆసియాగా చెప్పవచ్చు. పెంపకం మాత్రం జపాన్‌లోనే ఎక్కువ. ఎందుకంటే వీటిని అక్కడ 150 సంవత్సరాల నుంచీ ఆర్నమెంటల్ మొక్కలుగా విరివిగా పెంచుతున్నారని పరిశీలనలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా సమశీతోష్ణ ఉష్ణోగ్రత ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఇటీవల కాలంలో వీటిని బాగా పెంచుతున్నారు.

ఈతరం అమ్మాయిలు వీటిపై మోజుపడి కుండీల్లో చక్కగా పెంచడం మొదలు పెట్టారు. అతివలు ఇష్టపడే హైడ్రాంజియాలు నూరు వరహాలు లేదా గుత్తిపూల మాదిరిగా ఉంటాయి. వీటిల్లో పాకేవి ఉన్నాయి. హైడ్రాంజియాని ఫెన్సింగ్‌ల్లోనూ, గోడల మీద అల్లిస్తే ఆ అందమే వేరు.

ఏ రంగు కావాలి?

నేల తీరునుబట్టి రంగును మార్చే ఈ పూలలో ఉన్న చక్కని సౌలాభ్యం కోరుకున్న రంగులో వీటిని పూయించడమే. సున్నపు తేట లేదా అల్యూమినియం సల్ఫేట్లను నేలలో కలపడం ద్వారా దాని పీహెచ్ అంటే ఆమ్లక్షార గాఢతను పెంచడం, తగ్గించడం చూస్తే రంగును మార్చుకోవచ్చు.

సోడియం బైకార్పొరేట్‌ను తగిన మోతాదులో నేలలో కలిపితే హరివిల్లులోని సప్తవర్ణాన్ని పూలల్లో ఆవిష్కరించవచ్చు. నేలలోని సారం మారడమో లేదా మొక్కలలోనే మార్పులు రావడమో, కారణం ఏమిటన్నది? కచ్చితంగా తెలియదు కానీ ఈ మొక్క తన జీవితకాలం మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు ఒకటి, రెండేళ్ళపాటు ఆకుపచ్చ రంగులోనూ పుష్పిస్తుంది. ఆ తర్వాత దానంతట అదే రంగులు దిద్దుకుంటుంది. అయితే ఆ సమయంలో కూడా ఎరుపుల వాడకం ద్వారా పూలరంగును మార్చుకోవచ్చు.

సహజ రంగులు

ఎరువుల ద్వారా మార్చేవి కొన్నయితే వీటిల్లో కొన్ని రకాలు వాటంతటవే రంగుల్ని మార్చుకుంటుంటాయి. ఏడు రంగుల్ని పుష్పించే మొక్కలూ ఉన్నాయి. హైడ్రాంజియాల్లో ఇంద్ర ధనస్సు పూలు కాంతుల్ని వెదజిమ్ముతాయి. కాగా ఏరకమైనా మొక్కను నాటిన ఏడాదికి ఆ వాతావరణానికి తగ్గట్టు హైడ్రాంజియా అలవాటుపడుతుంది. సాధారణంగా ఇవి గులాబీ, నీలిరంగు ఛాయల్లోనే పుష్పిస్తాయి. గులాబీ రంగు పూలు వద్దనుకుంటే నేలలో కాస్త అల్యూమినియం సల్ఫేట్‌ను కలిపితే చాలు నీలిరంగులో పూలు పూస్తాయి.

గులాబీ రంగులోనే పుష్పించాలీ అంటే.. ఆ మొక్క నేలలోని అల్యూమినియంను గ్రహించకూడదు. అందుకోసం చిన్నచిన్న చిట్కాల్ని ఉపయోగిస్తే సరి. తరచూ సున్నపు నీళ్ళను నేలలో కలపడంవల్ల అక్కడి పీహెచ్ శాతం పెరుగుతుంది. దాంతో పీల్చుకునే సామర్థ్యం తగ్గుతుంది. మొక్కలో ఐరన్ లోపిస్తుంది. ఫలితంగా గులాబీ రంగులోనే పూలను పూస్తుంది.


నేల తీరు మాత్రమేకాక,కొన్ని సందర్భాల్లోవాతావరణం కూడాఈ పూలరంగుల్ని ప్రభావితం చేస్తుంది. వేడి వాతావరణంలో ఎంత ప్రయత్నించినా ఎర్రని హైడ్రాంజియాల్ని పూయించడం సాధ్యం కాకపోవచ్చు.

కాకపోతే ముదురు గులాబీ రంగు వరకూ ప్రయత్నించవచ్చు. దీనికి సంబంధించి మొక్క విత్తుల్ని కొనేటప్పుడు నర్సరీలు ఓ క్యాట్ ల్యాగ్‌ను కూడా ఇస్తున్నాయి. దాన్ని చూసి నేలలో ఎంత సున్నం కలపాలో నిర్ణయించుకోవచ్చు. సున్నం శాతం ఎక్కువయ్యే కొద్దీ ఎరువు శాతం పెరుగుతుంది. విభిన్న వర్ణాలే కాదు. త్వరగా వాడిపోని తాజాదనమూ వీటి సొంతం మొక్క నుంచి కోసిన ఈ రంగుల గుత్తుల్ని ఫ్లవర్ వేజ్‌లో పెడితే చాలాకాలం వాడకుండా ఉంటాయి.

సో... మీ వాకిట్లో ఏ రంగు హైడ్రాంజియాలు విరియాలన్నదీ వాటిని ఏ వర్ణంలోకి మార్చుకునేదీ అంతా మీ చేతుల్లోనే ఉంది మరి.

- కంచర్ల


బిడియము మనకేల?

ఎన్ని చట్టాలు చేసినా, ప్రభుత్వ అధికారులు, కళాశాల అధిపతులు ఎన్ని చర్యలు గైకొన్నా, ఫ్రెషర్స్ డే జరిపినా సదస్సులు, సభలు, సమావేశాలు నిర్వహించినా, నిరోధక చర్యలు ఎన్నింటిని చేపట్టినా ర్యాగింగ్ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవల కాలంలో గుంటూరు, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడిప్పుడే కొంత మార్పులు వస్తున్నా, ర్యాగింగ్ చేసిన విద్యార్థులు బలవంతుల కుటుంబాలకు చెందిన వారు కావడంతో తీవ్ర చర్యలు చేపట్టాక రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. అనేకచోట్ల ర్యాగింగ్ సంఘటనలను కళాశాల యాజమాన్యం వెలుగు చూడనీయటం లేదు.
మారుతున్న కాలంతో పాటు ర్యాగింగ్ భయాన్ని కూడా పారద్రోలాల్సిన అవసరం ఉంది.
బెరుకు, బిడియం ఉన్నవాళ్ళు ఇంట్లోనైనా కలివిడిగా తిరగలేరు. అలాంటి వారు స్కూలు నుంచి కళాశాలలో ప్రవేశిస్తే అయో‘మయసభ’లో అడుగు పెట్టినట్టే. నిజానికి అయోమయమనేది మనలోనే గాని, మనం వెళ్ళిన ప్రదేశంలో లేదు. కొత్తవారు కనిపించేసరికి అప్పటికే ఏడాది కాలంగా పాతుకుపోయిన వారిలో తుంటరితనం ప్రవేశిస్తుంది. కొత్తవాళ్ళను ఆట పట్టించాలనే కొంటెతనం లోలోపల నుంచి తన్నుకొస్తుంది. ఆ కొంటెతనం శ్రుతి మించేసరికి ర్యాగింగ్ ఓ భూతమవుతుంది.
ఎన్నో ఆశలు, ఆశయాలతో కళాశాల ప్రాంగణంలో బెరుకు బెరుకుగా ప్రవేశించిన జూనియర్లను తొలినాడు ర్యాగింగ్ భయపెడుతుంది. ర్యాగింగ్ పేరిట యుద్ధ ఖైదీలా వారిని చిత్రవిచిత్ర హింసకు గురిచేస్తారనే భయం ముందుగానే ఆవహిస్తుంది. తొలిపరిచయం ఆదరంగా, ఆప్యాయంగా ఉంటే దానిలోని మజాయే వేరుగా ఉంటుంది. అలాకాక కాస్తంత శ్రుతి మించినా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అసలెందుకీ ర్యాగింగ్? అన్న ప్రశ్న వేస్తే ... పరిచయం పెంచుకోవటానికని ఠక్కున సమాధానం వస్తుంది.
సాధారణంగా మన పక్కింట్లోకి ఎవరైనా కొత్తగా దిగితే పరిచయం చేసుకోవటం కోసం వారిని ఇబ్బందులకు గురిచేయం కదా! పైగా కొత్తకాబట్టి మన సహాయం ఏమైనా అవసరమేమోనని కొంచెం వాకబు చేస్తాం. అలాంటి ఉన్నత సంప్రదాయాలు అనుసరించే కుటుంబ వ్యవస్థ, ఔన్నత్యాన్ని ర్యాగింగ్ భూతం ఆవహించింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థినీ విద్యార్థుల ఎందరి జీవితాలనో ఇది బలి తీసుకుంటుంది. తాము చెప్పినట్లు చేయలేదని ఆగ్రహించిన ర్యాగింగ్ రాక్షసులు కిరాతకంగా హత్య చేసిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. సీనియర్లు కొత్తగా వచ్చిన సహ విద్యార్థిని ర్యాగింగ్ పేరిట వేధించటంతో ఆత్మహత్యలు చేసుకున్న ఉదాహరణలెన్నో. ఇది సహజంగానే కొత్తగా కళాశాలలోకి అడుగుపెట్టే విద్యార్థులందర్నీ భయకంపితులను చేస్తుంది. సీనియర్ల వెకిలి చేష్టలకు, పెడపోకడలకు, అవమానకర వ్యాఖ్యలకు కుంగిపోతూనే వౌనంగా వేదనను అనుభవించే వారెందరో. తల్లిదండ్రులకు చెబుతామంటే వారిని బాధ పెట్టడం ఎందుకన్న ఆలోచనతో వెనక్కు తగ్గుతుంటారు. కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తామంటే, ఆ కక్షతో మరింత వేధిస్తారని జంకుతుంటారు. ఒకవేళ ఫిర్యాదు చేసినా న్యాయం జరిగిన సంఘటనలు బహుకొద్ది. ఈ వేధింపులు భరించలేని సున్నిత హృదయాలు లక్షణమైన కోర్సుకు పుల్‌స్టాప్ పెట్టేసి, లక్ష్యంలేని ఏదో ఒక చదువుకు సిద్ధమైపోతున్నారు. మరికొందరైతే కాలేజీ చదువులకే స్వస్తి పలుకుతున్నారు.
ఒకప్పుడు కేవలం కొత్తవారితో మాట కలిపి వారికి కళాశాల వాతావరణాన్ని పరిచయం చాలనే సదుద్దేశంతో ఇది మొదలైంది. అప్పుడు సత్ఫలితాలే లభించాయి. బెరుకు, బిడియం వదిలి ఉజ్వల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకున్నారు. అయితే కాలానుగుణంగా ఆధునికమయి ర్యాగింగ్‌లో అనాగరిక లక్షణాలు కనిపించడం మొదలైంది. ఇది తీవ్రస్థాయిలో రూపుదాల్చి విషాద పరిణామాలు చోటుచేసుకున్న స్థితికి చేరుకుంది.
అలాగే కాలేజీలో కొత్తగా అడుగుపెట్టే అమ్మాయిలూ, అబ్బాయిలూ గుండెనిండా మనసును నిగ్రహించుకోవాలి. ర్యాగింగ్‌కు భయపడడం మొదలైతే మీసాటి అమ్మాయిలూ, అబ్బాయిలూ పరిసరాలు, పాఠాలు అన్ని మనతో ఆడుకుంటాయని గుర్తించి, ధైర్యంగా ముందుకు నడవండి. బెరుకు, బిడియం ఇంట్లోనే వదిలేసి కాలేజీలో హ్యాపీగా అడుగు పెట్టండి. ఆద్ ద బెస్ట్..

- కె.ఎస్.


అమ్మాయలు ఇష్టపడాలంటే...

ఈ తరం అభిరుచి..

- కంచర్ల

బాయ్ ఫ్రెండ్స్‌ను అర్థం చేసుకోవడం చాలా తేలిక. ఏయే సందర్భాల్లో మగవారు ఎలా నడుచుకుంటారో, వారి ప్రవర్తనలు ఎలా ఉంటాయో అంచనా వేయడానికి పెద్ద తెలివి తేటలు అక్కర్లేదు. కామెన్ సెన్స్ ఉంటేచాలు’ అంటున్నారు ఈతరం అమ్మాయిలు.




బ్బాయిల్ని యిష్టపడాలంటే వారు ఎలా నడుచుకోవాలో, ఎలాంటి వారిని లైక్ చేస్తారో ఈ అమ్మాయిలు చెపుతున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా గూడూరు, కావలి, బ్రహ్మదేవి, బుజబుజ నెల్లూరులోని కాలేజీ అమ్మాయిలు తమ అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేస్తున్నారు. సో... అమ్మాయిలతో పాటు అబ్బాయిలూ ఆలకించాలి! ఈతరం యువతులు సమానత్వం కోరుకుంటున్నారు. అవకాశం అందితే ఒక మెట్టు పైనే ఉండాలని అనుకుంటున్నారు. అసలు, ఆడ, మగ సమానమా.. కాదా... వంటి వాదనలు కాసేపు పక్కన పెడితే తనపై ప్రత్యేక శ్రద్ధ కనబరచని అబ్బాయిలంటే అమ్మాయిలకు అసలు ఇష్టం ఉండదుట. ఈతరం అమ్మాయిలకు ‘మహారాణి’గా మంచి హోదా ఇవ్వాలని అంటున్నారు. నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోయే అబ్బాయిలంటేనే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. పెద్ద గొంతుతో గోలగోలగా మాట్లాడే వాళ్ళతో కాసేపు గడపాలన్నా చిరాకే. వారి గొడవ వారిది తప్పితే ఇలాంటి వ్యాఖ్యలు ఎదుటివారి భావాలను అర్థం చేసుకోలేరు. హుందాగా ప్రవర్తిస్తూ, ఎదుటివారిని కలుపుకుంటూపోయే వారు మంచి ఫ్రెండ్‌గా, ఇష్టపడితే మంచి భాగస్వామిగా రాణిస్తారని అలాంటి వారికే అమ్మాయిలు ఎక్కువగా మార్కులు వేస్తున్నారు. మొట్టమొదటి సారిగా కలసి బయటకు వెళ్ళినప్పుడు కాస్తయినా మొహమాటం, మర్యాద లేకుండా ‘‘ఎవరి బిల్లు వారే కడితే’’ అని అడిగే అబ్బాయిలను అమ్మాయిలు ఏ మాత్రం ఇష్టపడరంటున్నారు.
స్నేహం బాగా పెరిగాక సంగతి వేరు. కానీ మొదటిసరా కాఫీకి, కూల్‌డ్రింక్‌కూ కూడా లెక్కలు చూసుకునే వాళ్ళంటే చులకన భావమే తప్ప గౌరవం కలగదట.
తమతమ సంస్కారం కొద్దీ కొంతమంది అమ్మాయిలు బిల్లు తామే కడతామని చెప్పవచ్చు. అది వేరే విషయం. కానీ ఆమాట అబ్బాయిలు అడిగితే మాత్రం అమ్మాయిలు సహించలేరని వారు అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.



అమ్మను ఇష్టపడితే చాలు..




అమ్మను ఇష్టపడే మగవాళ్ళంటే సాధారణంగా అమ్మాయిలకు యిష్టం. తల్లిని గౌరవించిన వాడు భార్యనూ గౌరవిస్తాడని అమ్మాయిలకు ఓ నమ్మకం. అమ్మపట్ల ఆరోగ్యకరమైన ప్రేమ ఉన్నా అబ్బాయిని అమ్మాయి ఇష్టపడుతుంది. భార్య స్థానంలో ఉన్నా తనను అలాగే గౌరవిస్తాడనే నమ్మకం అమ్మాయికుంది. ఈ జన్మకు కారకురాలు ఆ అమ్మే కదా మరి!

-పల్లవి

ఏడ్వగలిగినవాడే మగాడు


మనస్ఫూర్తిగా ఏడ్వగలగడం ఓ వరం. ఇది అమ్మాయిలకే పరిమితమైన విషయమనుకోను. మన సమాజంలో మగాళ్ళు ఏడవకూడదన్నట్టుగా చిన్నప్పటి నుంచీ పెంచుతారు. నిజానకి దుఃఖం వచ్చినప్పుడు ఏడ్వడానికి సిగ్గుపడనివాడే అసలైన మగాడు. బాధను వ్యక్తం చేసేందుకు సంకోచించని వాడే తన బాధ్యతలనూ పరిపూర్ణంగా నిర్వర్తించగలడు.

-సితార

నిజాయితీ ముఖ్యం




ఏ విషయంలోనై  నా  ఆడవాళ్ళకు నిజం కావాలి.   కేవలం నిజం. అది బాధపెట్టేదైనా సరే. భయపెట్టేదైనా సరే... దాన్ని ఎదుర్కొనే మానసిక సన్నద్ధత అమ్మాయిలకు లేకపోలేదు. అబద్ధం చెప్పి సంతోష పెట్టేకంటే నిజం చెప్పి కష్టపెట్టినా సరే అమ్మాయిలు స్వాగతిస్తారు. అసలు ఓ విషయంలో నిజం దాచాల్సి వచ్చిందంటేనే ఏమో ఎవరికి తెలుసు?

-స్వర్ణ

మరో అమ్మాయి జోలికెళితే...


ఎంత ఆధునికత అంటూ కబుర్లు చెప్పినా, స్నేహాలే కదా ఏముందిలే అని పైపైన సర్దుకున్నట్టు కనబడినా తన బాయ్ ఫ్రెండ్ ఇంకొకరివైపు కనె్నత్తి చూడడాన్ని కూడా ఏ అమ్మాయి సహించదు. ఈ విషయంలో ఓటు సంప్రదాయానికే. ‘‘నేను ఆమెతో అలా...’’ ‘కాలేజీలో ఇలా’.. అంటూ గొప్పలకు పోయే కోతలరాయుళ్ళంటే అమ్మాయిలకు ఒళ్ళు మండి పోతుంది.

-రాధ



మల్లెపూల పరిమళంగా...



ఈ రోజుల్లో అమ్మాయిలూ మంచి చదువులు చదివి, అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ సంపాదిస్తున్నారనేది నిజం. తాము ఎంత సంపాదించినా సరే. బాయ్ ఫ్రెండ్ సంపాదనను ఖర్చు పెట్టడానికే అమ్మాయిలు ఇష్టపడతారు. ‘‘నీవు తెచ్చే మల్లెపూలకు పరిమళం ఎక్కువ’’ అన్న సంగతి తెలుసుకదా! అది డబ్బుల విషయంలోనూ వర్తిస్తుంది.

-అలేఖ్య

అమ్మాయిలకే తెలివెక్కువ!



మానసికంగా అబ్బాయిలకంటే మేమే బలవంతులం. ఈ విషయంలో అనవసరంగా వాదించి టైం వృథా చేసుకోలేం. సాధారణ తెలివితేటలున్న ఓ అమ్మాయి కూడా ఓ తెలివైన అబ్బాయిని అంచనా వేయడంలో పొరబడదు. అదే చాలా తెలివి తేటలున్న అబ్బాయి అమాయకమైన అమ్మాయి మనసును అర్థం చేసుకోవడంలో కూడా బోర్లా పడతారు.

-సృజన

Sunday, December 26, 2010

చలి

చలి పులి


చలికాలంలో చల్లని పచ్చిగడ్డిపై నడవకూడదు సుమా! మంచు కప్పిన గడ్డపై పాదరక్షలు లేకుండా నడిస్తే జ్వరం, దగ్గు జలుబు వస్తాయి. ఇక వేడివేడిగా తిని ఆపై వెంటనే చల్లటి పదార్థం తినటం శరీరానికి చేటు. గరంగరం చాయ్ తాగి ఆపై ఐస్‌క్రీం మెక్కాలనుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరగటం, తగ్గటంతో ఆరోగ్యానికే భంగం. చల్లని ఐస్‌క్రీం బాగా తిని ఆపై వేడి చాయ్ తాగరాదు. ఆరోగ్యానికి మంచిది కదా అని డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, పిస్తా, వేరుసెనగ పప్పు మితిమీరి తింటే జాండీస్, అజీర్ణం, అన్నం, అరగకపోటం, తప్పనిసరి. కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. చన్నీటి స్నానం (కార్తీక స్నానం) వల్ల ఎముకల్లో నెప్పి, రక్తం గడ్డకట్టి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. గోరువెచ్చని స్నానం బెస్టు. ఎలక్ట్రానిక్ రగ్గుల వాడకం విదేశాల్లో మంచు కప్పేచోట ఫర్వాలేదు కానీ, మనకు అవి వద్దేవద్దు. గదిలో హీటర్, బాగా చలి ఉన్నప్పుడే వాడాలి. హీటర్ని వాడేటప్పుడు ఒక పాత్రలో నీటిని నింపి ఉంచాలి. గది తలుపులు తెరిచే ఉంచాలి. దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ బైటికి పోయి, ఆక్సిజన్ లోపలికి వస్తుంది. మన దేశంలో చలికాలంలో 10 మందిలో ఒకరు ఈ హీటర్ వల్ల గదిలో కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తియై చనిపోతున్నారుట.
జంక్‌ఫుడ్, వేపుళ్ళు, తినరాదు. పళ్ళు, సూప్స్ తీసుకోవాలి. రాత్రి తిండి ఎక్కువతై బరువు, లావు పెరగటం ఖాయం. నీరు కనీసం 8 గ్లాసులు తాగాలి. సూర్యకాంతి తగ్గటంవల్ల శరీరంలో స్టోర్ అయి ఉన్న బ్రెయిన్ కెమికల్ తగ్గుతుంది. అందుకే మాటిమాటికీ ఏదేదో తినాలన్పిస్తుంది. ఎక్కువగా కార్బొహైడ్రేట్స్, సెనగ, పెసరపప్పులు తినాలి. శీతాకాలంలో ప్రకృతి సహజ రంగులున్న కూరలు తినాలి. క్యారెట్, క్యాబేజీ, టమోటా, ఉల్లి సలాడ్స్‌గా తింటే ఉత్తమం. చలికి దాహం అన్పించదు కానీ ఆకలేస్తుంది. తిండి కాకుండా మంచినీరు తాగటం ఉత్తమం. బరువు పెరగకుండా వాకింగ్, ఇంట్లో పని చేస్తుండాలి. జంక్‌ఫుడ్స్, హాట్ క్రీమ్ చాక్లెట్స్ తీసుకోరాదు. ఆకల్తో నకనకలాడటం కూడా మంచిది కాదు. చాలాసేపు ఆకల్తో మాడి ఆపై సుష్టుగా భోజనం చేస్తే బరువు పెరగటం ఖాయం. కొద్ది మోతాదులో ఆహారం మూడు సార్లు తీసుకోవాలి. చలికాలంలో సీజనల్ ఎఫెక్టివ్ డిస్ ఆర్డర్ వల్ల మనకి ఎప్పుడు సంతోషం, ఎప్పుడు దుఃఖం కలుగుతుందో చెప్పలేం. మన మూడ్స్ మారుతుంటాయి. దీనే్న మూడ్‌జింగ్ డిసార్డర్ అని అంటారు. టపటప తెగవాగి, వెంటనే మాట్లాడకుండా వౌనవ్రతం పడ్తారు. యువకులు కూడా ఈ సీజన్‌లో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్‌కి గురువుతారు. చదువు, కెరీర్‌ని గూర్చిన దిగులు వేధిస్తుంది. స్ర్తిలలో కుటుంబ సమస్యలు, మోనోపాజ్‌వల్ల చిటచిటలాడతారు. మన మస్తిష్కంలో రిలీజయ్యే కెమికల్స్ వల్ల మూడ్‌స్వింగ్ డిస్ ఆర్డర్ కల్గి శారీరకంగా, నీరసంగా అన్పించడం, నిద్రరాకపోవటం, లేక తెగ నిద్రపోవటం చక్కెర తెగ తినటం జరుగుతుంది. ఖాళీ పొట్ట వలన కూడా ఇలా జరగవచ్చు. మన ప్రకారం సీజన్స్ మారవు. సీజన్స్‌ని బట్టి మనం మారాలి. అందుకే మన మూడ్ బాగుండేలా పాజిటవ్ థింకింగ్ రావాలి. అందుకే గదులు సర్దటం, మంచి సంగీతం వినటం, విండో షాపింగ్ చేయటం చేయాలి.
శీతాకాలంలో పసివారి సంరక్షణ
అన్ని కాలాలకి పెద్దవారు తట్టుకోగలరు. కాన పసికూనల సంగతేంటి? చలికి వారు ఎన్నోరకాల రోగాలకి గురవుతారు. జలుబు, దగ్గు, ముక్కుదిబ్బడ, ఊపిరాడకపోవటం, జ్వరం, చెవి, గొంతు ఇన్‌ఫెక్షన్ ఇలా ఎన్నో బాధలు. వైరస్ పసివారిలో త్వరగా దాడిచేసి, వారిని, తల్లిదండ్రుల్ని అతలాకుతలం చేస్తుంది. డాక్టరుకి చూపి మందులు వాడ్తున్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శిశువుని బాగా శుభ్రంగా ఉంచాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. శుభ్రంగా తుడవటం చేయాలి. రాత్రి పొత్తిగుడ్డలు మారుస్తుండాలి. వేడినీటిలో ఉతికి ఆరేయాలి. ఉదయం ఎండలో తిప్పాలి.
ఇక ఈ పనుల్తో పసివారిని బేజారు చేయరాదు. బాగా బిగుసుకుపోయేలా ఉన్ని దుస్తులు వేయరాదు. చెమటలు పట్టి, చలివేసి ఆపై జలుబు, దగ్గు దాడి చేస్తాయి. మొహాన్ని బట్టతో కప్పరాదు. స్నానం చేయించాక పొడి దుస్తులు తొడగాలి. అలా బైటికి తీసుకెళ్ళరాదు. సాయంత్రం, సూర్యాస్తమయం తర్వాత షికారుగా పసివారిని తీసుకుని బైటకెళ్ళరాదు. కానీ అందరూ సరదాగా సాయంత్రమే పసివారిని బైటికి తీసుకెళ్తారు. ఏడాది లోపల పిల్లల తలభాగం చాలా సున్నితంగా ఉంటుంది. డైరెక్టుగా ఊలు టోపీ నెత్తికి తగిలించకూడదు. మెత్తటి నూలు బట్టని స్కార్ఫ్ లాగా తలకి అమర్చి ఆపై ఊలు టోపీ పెట్టాలి. ఎవరికైనా బాగా జలుబు, దగ్గు ఉంటే పిల్లల్ని వారి దగ్గర ఉంచరాదు. రోగ నిరోధక శక్తి పెరిగేలా కృషి చేయాలి.
శీతాకాలం ఫ్యాషన్లు
చలికాలం బాగా బ్రైట్ కలర్స్ టైట్స్, ఫ్యాషన్‌గా మారాయి. సరియైన టాప్, షూస్‌తో వేసుకోకుంటే అంతా గడిబిడే. ప్లేన్ సెల్ఫ్ కలర్డ్ టైట్స్ బాగా పాపులర్. సెల్ఫ్‌డిజైన్ టైట్స్ కూడా బాగానే ఉంటాయి. వీటితో పంప్, హైహీల్, ఓపెన్ ఏర్ శాండిల్స్, షూస్ బాగుంటాయి. చలేస్తుంటే ట్యూనిక్‌లో బ్లేజర్ కూడా ధరించాలి. భారీ కాయం వారు గాఢ రంగంలో ఉన్న టైట్స్ ధరించాలి. నేడు ఎక్కడ చూసినా లెగింగ్స్ మంచి ఫామ్‌లో ఉన్నాయి. కార్డిగన్, పులోవర్ మంచి స్మార్ట్ లుక్ ఇస్తాయి. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ జాకెట్స్ హవా నడుస్తోంది. చాక్లెట్, ఖాళీ, లిహెక్ రంగు జాకెట్, బ్లేజర్ ధరించాలి. ఇంబెలిష్ట్ జాకెట్, స్కర్ట్ వెల్వెట్‌వి అయితే గ్లామరస్ లుక్ వస్తుంది. బ్రౌన్, ఖాకీ, బ్లాక్‌తో బ్రైట్ పింక్ బటర్‌కప్ ఎల్లో, లైమ్ గ్రీన్ చాలా అందాన్నిస్తాయి. యాంకిల్ లెన్త్‌బూటు, స్నీకర్, స్కార్ఫ్ డ్రెసెస్, కార్సెట్ మంచి లుక్‌ని ఇస్తాయి. సాఫ్ట్ సిల్కు, షిఫాన్, క్రోషె, నూలు, ఉన్ని ఫ్యాబ్రిక్ స్కార్ఫ్ వాడాలి. బ్లూ, గ్రీన్, పెష్టల్, లెవెండర్, రెడ్ కలర్ స్కార్ఫ్స్ లాంటి డ్రెస్సులైనా భలేగా పని చేస్తాయి. టుబాకో, బటర్, వైన్, లెమన్ గ్రాస్ లాంటి హాట్ షేడ్స్ స్కార్ఫ్ చలికాలం బాగుంటాయి. జ్యూమెట్రిక్, ఫ్లోరల్ ప్రమింట్, బీడెడ్ స్కార్ఫ్స్ లభిస్తున్నాయి. జీన్స్‌తో పాటు బెల్డు బదులుగా స్కార్ఫ్ కట్టండి. ప్లేన్ డెనిమ్‌పై ప్రింటెడ్ స్కార్ఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది.