Sunday, December 26, 2010

చలి

చలి పులి


చలికాలంలో చల్లని పచ్చిగడ్డిపై నడవకూడదు సుమా! మంచు కప్పిన గడ్డపై పాదరక్షలు లేకుండా నడిస్తే జ్వరం, దగ్గు జలుబు వస్తాయి. ఇక వేడివేడిగా తిని ఆపై వెంటనే చల్లటి పదార్థం తినటం శరీరానికి చేటు. గరంగరం చాయ్ తాగి ఆపై ఐస్‌క్రీం మెక్కాలనుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరగటం, తగ్గటంతో ఆరోగ్యానికే భంగం. చల్లని ఐస్‌క్రీం బాగా తిని ఆపై వేడి చాయ్ తాగరాదు. ఆరోగ్యానికి మంచిది కదా అని డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, పిస్తా, వేరుసెనగ పప్పు మితిమీరి తింటే జాండీస్, అజీర్ణం, అన్నం, అరగకపోటం, తప్పనిసరి. కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. చన్నీటి స్నానం (కార్తీక స్నానం) వల్ల ఎముకల్లో నెప్పి, రక్తం గడ్డకట్టి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. గోరువెచ్చని స్నానం బెస్టు. ఎలక్ట్రానిక్ రగ్గుల వాడకం విదేశాల్లో మంచు కప్పేచోట ఫర్వాలేదు కానీ, మనకు అవి వద్దేవద్దు. గదిలో హీటర్, బాగా చలి ఉన్నప్పుడే వాడాలి. హీటర్ని వాడేటప్పుడు ఒక పాత్రలో నీటిని నింపి ఉంచాలి. గది తలుపులు తెరిచే ఉంచాలి. దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ బైటికి పోయి, ఆక్సిజన్ లోపలికి వస్తుంది. మన దేశంలో చలికాలంలో 10 మందిలో ఒకరు ఈ హీటర్ వల్ల గదిలో కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తియై చనిపోతున్నారుట.
జంక్‌ఫుడ్, వేపుళ్ళు, తినరాదు. పళ్ళు, సూప్స్ తీసుకోవాలి. రాత్రి తిండి ఎక్కువతై బరువు, లావు పెరగటం ఖాయం. నీరు కనీసం 8 గ్లాసులు తాగాలి. సూర్యకాంతి తగ్గటంవల్ల శరీరంలో స్టోర్ అయి ఉన్న బ్రెయిన్ కెమికల్ తగ్గుతుంది. అందుకే మాటిమాటికీ ఏదేదో తినాలన్పిస్తుంది. ఎక్కువగా కార్బొహైడ్రేట్స్, సెనగ, పెసరపప్పులు తినాలి. శీతాకాలంలో ప్రకృతి సహజ రంగులున్న కూరలు తినాలి. క్యారెట్, క్యాబేజీ, టమోటా, ఉల్లి సలాడ్స్‌గా తింటే ఉత్తమం. చలికి దాహం అన్పించదు కానీ ఆకలేస్తుంది. తిండి కాకుండా మంచినీరు తాగటం ఉత్తమం. బరువు పెరగకుండా వాకింగ్, ఇంట్లో పని చేస్తుండాలి. జంక్‌ఫుడ్స్, హాట్ క్రీమ్ చాక్లెట్స్ తీసుకోరాదు. ఆకల్తో నకనకలాడటం కూడా మంచిది కాదు. చాలాసేపు ఆకల్తో మాడి ఆపై సుష్టుగా భోజనం చేస్తే బరువు పెరగటం ఖాయం. కొద్ది మోతాదులో ఆహారం మూడు సార్లు తీసుకోవాలి. చలికాలంలో సీజనల్ ఎఫెక్టివ్ డిస్ ఆర్డర్ వల్ల మనకి ఎప్పుడు సంతోషం, ఎప్పుడు దుఃఖం కలుగుతుందో చెప్పలేం. మన మూడ్స్ మారుతుంటాయి. దీనే్న మూడ్‌జింగ్ డిసార్డర్ అని అంటారు. టపటప తెగవాగి, వెంటనే మాట్లాడకుండా వౌనవ్రతం పడ్తారు. యువకులు కూడా ఈ సీజన్‌లో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్‌కి గురువుతారు. చదువు, కెరీర్‌ని గూర్చిన దిగులు వేధిస్తుంది. స్ర్తిలలో కుటుంబ సమస్యలు, మోనోపాజ్‌వల్ల చిటచిటలాడతారు. మన మస్తిష్కంలో రిలీజయ్యే కెమికల్స్ వల్ల మూడ్‌స్వింగ్ డిస్ ఆర్డర్ కల్గి శారీరకంగా, నీరసంగా అన్పించడం, నిద్రరాకపోవటం, లేక తెగ నిద్రపోవటం చక్కెర తెగ తినటం జరుగుతుంది. ఖాళీ పొట్ట వలన కూడా ఇలా జరగవచ్చు. మన ప్రకారం సీజన్స్ మారవు. సీజన్స్‌ని బట్టి మనం మారాలి. అందుకే మన మూడ్ బాగుండేలా పాజిటవ్ థింకింగ్ రావాలి. అందుకే గదులు సర్దటం, మంచి సంగీతం వినటం, విండో షాపింగ్ చేయటం చేయాలి.
శీతాకాలంలో పసివారి సంరక్షణ
అన్ని కాలాలకి పెద్దవారు తట్టుకోగలరు. కాన పసికూనల సంగతేంటి? చలికి వారు ఎన్నోరకాల రోగాలకి గురవుతారు. జలుబు, దగ్గు, ముక్కుదిబ్బడ, ఊపిరాడకపోవటం, జ్వరం, చెవి, గొంతు ఇన్‌ఫెక్షన్ ఇలా ఎన్నో బాధలు. వైరస్ పసివారిలో త్వరగా దాడిచేసి, వారిని, తల్లిదండ్రుల్ని అతలాకుతలం చేస్తుంది. డాక్టరుకి చూపి మందులు వాడ్తున్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శిశువుని బాగా శుభ్రంగా ఉంచాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. శుభ్రంగా తుడవటం చేయాలి. రాత్రి పొత్తిగుడ్డలు మారుస్తుండాలి. వేడినీటిలో ఉతికి ఆరేయాలి. ఉదయం ఎండలో తిప్పాలి.
ఇక ఈ పనుల్తో పసివారిని బేజారు చేయరాదు. బాగా బిగుసుకుపోయేలా ఉన్ని దుస్తులు వేయరాదు. చెమటలు పట్టి, చలివేసి ఆపై జలుబు, దగ్గు దాడి చేస్తాయి. మొహాన్ని బట్టతో కప్పరాదు. స్నానం చేయించాక పొడి దుస్తులు తొడగాలి. అలా బైటికి తీసుకెళ్ళరాదు. సాయంత్రం, సూర్యాస్తమయం తర్వాత షికారుగా పసివారిని తీసుకుని బైటకెళ్ళరాదు. కానీ అందరూ సరదాగా సాయంత్రమే పసివారిని బైటికి తీసుకెళ్తారు. ఏడాది లోపల పిల్లల తలభాగం చాలా సున్నితంగా ఉంటుంది. డైరెక్టుగా ఊలు టోపీ నెత్తికి తగిలించకూడదు. మెత్తటి నూలు బట్టని స్కార్ఫ్ లాగా తలకి అమర్చి ఆపై ఊలు టోపీ పెట్టాలి. ఎవరికైనా బాగా జలుబు, దగ్గు ఉంటే పిల్లల్ని వారి దగ్గర ఉంచరాదు. రోగ నిరోధక శక్తి పెరిగేలా కృషి చేయాలి.
శీతాకాలం ఫ్యాషన్లు
చలికాలం బాగా బ్రైట్ కలర్స్ టైట్స్, ఫ్యాషన్‌గా మారాయి. సరియైన టాప్, షూస్‌తో వేసుకోకుంటే అంతా గడిబిడే. ప్లేన్ సెల్ఫ్ కలర్డ్ టైట్స్ బాగా పాపులర్. సెల్ఫ్‌డిజైన్ టైట్స్ కూడా బాగానే ఉంటాయి. వీటితో పంప్, హైహీల్, ఓపెన్ ఏర్ శాండిల్స్, షూస్ బాగుంటాయి. చలేస్తుంటే ట్యూనిక్‌లో బ్లేజర్ కూడా ధరించాలి. భారీ కాయం వారు గాఢ రంగంలో ఉన్న టైట్స్ ధరించాలి. నేడు ఎక్కడ చూసినా లెగింగ్స్ మంచి ఫామ్‌లో ఉన్నాయి. కార్డిగన్, పులోవర్ మంచి స్మార్ట్ లుక్ ఇస్తాయి. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ జాకెట్స్ హవా నడుస్తోంది. చాక్లెట్, ఖాళీ, లిహెక్ రంగు జాకెట్, బ్లేజర్ ధరించాలి. ఇంబెలిష్ట్ జాకెట్, స్కర్ట్ వెల్వెట్‌వి అయితే గ్లామరస్ లుక్ వస్తుంది. బ్రౌన్, ఖాకీ, బ్లాక్‌తో బ్రైట్ పింక్ బటర్‌కప్ ఎల్లో, లైమ్ గ్రీన్ చాలా అందాన్నిస్తాయి. యాంకిల్ లెన్త్‌బూటు, స్నీకర్, స్కార్ఫ్ డ్రెసెస్, కార్సెట్ మంచి లుక్‌ని ఇస్తాయి. సాఫ్ట్ సిల్కు, షిఫాన్, క్రోషె, నూలు, ఉన్ని ఫ్యాబ్రిక్ స్కార్ఫ్ వాడాలి. బ్లూ, గ్రీన్, పెష్టల్, లెవెండర్, రెడ్ కలర్ స్కార్ఫ్స్ లాంటి డ్రెస్సులైనా భలేగా పని చేస్తాయి. టుబాకో, బటర్, వైన్, లెమన్ గ్రాస్ లాంటి హాట్ షేడ్స్ స్కార్ఫ్ చలికాలం బాగుంటాయి. జ్యూమెట్రిక్, ఫ్లోరల్ ప్రమింట్, బీడెడ్ స్కార్ఫ్స్ లభిస్తున్నాయి. జీన్స్‌తో పాటు బెల్డు బదులుగా స్కార్ఫ్ కట్టండి. ప్లేన్ డెనిమ్‌పై ప్రింటెడ్ స్కార్ఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది.