Sunday, January 23, 2011

story

కవితా సేవ

సేవ

ప్రజాసేవ కాదు..

ప్రజల సేవ .. అక్షర సేవ.

ప్రజాసేవలో మోసం -

ప్రజల సేవలో ఆనందం ..

…అందులో రాజకీయం

ఇందులో నిస్వార్ధం

కత్తిలాంటి కలం …..

సేవలో ఉంది నిజం.

అక్షరం సాగిస్తుంది సేవ

పార్టీలకతీతంగా  చేస్తుంది సేవ

గొప్పది..గొప్పది  ఈ సేవ.

మంచోల్లందరికీ నచ్చుతుంది

గిట్టనోల్లకు నొప్పుతుంది.

– కత్తిమండ ప్రతాప్

———————————————————————-

హృదయంలోకి

వంపు తిరిగే దారులు

నాహృదయం అని నేను పిలుచుకునే దాంట్లోకి
దారులు వంపు తిరుగుతాయి
ఆ దారుల్లో నేను ఒంటరిగా కాని
లేక నాకిష్టమైన వాళ్ల జ్ఞాపకాల్తో పాటుగాని పయనించాను.
ఒక్కోసారి అద్దాల్లా మెరిసే భవనాల ఉపరితలానికడ్డంగా
విస్తరిస్తూ సాగే ఉషస్సులాగ-
ఒక్కోసారి అవి నా కంటిమధ్యలోంచి పోయేలా
కాగితపు ముఖంమీద గీసిన గీతలంత సన్ననివి
నా హృదయం అని నేను పిలుచుకునే దాంట్లోకి
వంపు తిరిగే దారులు
నా ఇంటి గోడల్ని నా జీవితపు గుంతలో
కరగించే రాత్రులవంటివి
నా హృదయం అని నేను పిలుచుకునేదాంట్లోకి
దారులు వంపు తిరుగుతాయి
ఆ దారుల్లో నేను ఒంటరిగా కాని
లేక నాకిష్టమైన వాళ్ల జ్ఞాపకాల్తో పాటుగాని పయనించాను
నేను వీటి కొసల్లో అంతవౌతుంటే
ఇవి మళ్లీ మొదలవుతాయి
ఈ దారుల చివర్లను ఏమని పిలవాలి?

– నాగ

——————————————————————-

చిట్టి కవితలు

మా పల్లె బస్సు
నిండుగర్బిణి
ఎప్పుడూ
ప్రసవవేదనే!
చిత్తు
కాగితానికి
విలువనిస్తుంటే
అది డబ్బే

-శ్రీనివాస్

————————————————————-

నాలో నేను

నిత్యం
నేను నాలోకి ప్రవహిస్తుంటాను
నిశితంగా పరామర్శించుకుంటాను
మానవీయపు పలకరింపులు
మనోపేటికలో
జ్ఞాపకాల దొంతరలై
పరిమళిస్తూనే వుంటాయి.
అవాంఛిత రాగాలు రోగాలై శ్వాసించినా
నిశ్వాసమై విడిచిపెడుతుంటాను
మనసు మర కాదు కదా…!
పాతికేళ్ళనాటి ప్రతిరూప చిత్రం
రంగుల కాగితంపై
కళ్ళముందు దర్శనమిస్తూనే వుంటుంది
ఛాయచిత్రం మాయాచిత్రమై
మోసం చేయవచ్చేమోగాని
మనసెప్పుడూ మానవీయత్వపు
మల్లెచెండే
దశాబ్దాల ప్రయాణం
శరీరం వనె్నతగ్గించిందేమోకాని
మనోశ్వాస
కొత్తచిగురై పల్లవిస్తూనే వుంది
నేను నిరంతరం
ప్రవహించే ‘‘మనిషి’’ని

-సోమేపల్లి వెంకటసుబ్బయ్య

——————————————————————–

*****************

కత్తిమండ కవితాక్షరం

*****************

రాజకీయమా …!

హలో ఒక్క మాట
ప్రభుత్వం ఉందా?
ఉంది.

ఎక్కడా?
సచివాలయంలో..


ఏమిచేస్తుంది?
నిద్రపోతుంది .


ముఖ్యమంత్రి ఉన్నాడా?
ఉన్నాడు


ఎక్కడా?
పదవి కాపాడుకోవడం లో..


ఎందుకు ?
తుమ్మితే ఉడే ముక్కు కదా…
ఒహొ…!


ఎందుకని?
రబ్బరు స్టాంప్ కదా…
మరి ..మరిఏ ..


రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా?
ఉందయ్యా  బాబు .


ఎక్కడా ?
మంచం మీద .


అదేమిటి?
మరి చంద్రబాబు ఉన్నదీ
మొన్నటి వరకు మంచం మీదే కదా .


పడుకున్నడా ?
అబ్బా..
ప్రతిపక్షం పడుకుంది..
నేడే సైకిలేక్కింది.


కోత్హపార్తీలు లేవా?
ఉన్నాయి


ఎక్కడా ..?
మొన్న కృష్ణా నదిలో
నేడు విశాఖ తీరాన ..


అదేంటి..?
రైతులకు పిండాకూడు పెడుతున్నారు
ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు


ఎర్రజెండాలు లేవా..?
ఉన్నాయి.


మరి వాళ్ళు …!
ఎర్రోళ్ళు ఐపోయారు


ప్రజల పేరుతో వచ్చిన పార్టీ లేదా..?
ప్రజలు లేకుండా పోయారు.


ఇంతకు మనది ఏ రాష్ట్రం….?
రావణ రాష్ట్రం


ఆంధ్రప్రదేశ్ కాదా…?


దీక్షాన్ద్రప్రదేశ్…. !

– కత్తిమండ   ప్రతాప్

————————————————

కులం రక్కసి

కులం కులం కాకుల కులం
కావాలి అందరికి ….ఆ కులం
రక్తం కక్కుకు చావడానికి
కులం తో ‘మాల’కట్టవచ్చు
ఆ ‘మాల’ ‘మాదేగా’ అనవచ్చు
చావొచ్చు ..చంపొచ్చు ..చంపుకోవచ్చు
‘కాపు’ కాయలేని ఈ కుల సమాజం లో


నువ్వే ‘రాజు’వి ..
నువ్వే  జుస్టీస్  ‘చౌదరి’ వి ..
నువ్వే బండేక్కే బం’డ్రేడ్డి’వి..
అందుకే కుల బండులోస్తున్నై
ఓపికుంటే ముందుకు త్రోసుకు చావండి


పదండి ముందుకు..
పదండి ముందుకు…
తోసుకు పోదాం

కుల చక్రాలను
త్రోలుకు పోదాం…


కుల చక్రాల కుతంత్రాల కింద పడి
చచ్చిపోదాం….

- కత్తిమండ ప్రతాప్

No comments:

Post a Comment